చెస్‌ ఒలింపియాడ్​లో అగ్రస్థానంలో హంపీ బృందం

-

చెస్‌ ఒలింపియాడ్‌ ఆరో రౌండ్లో భారత్‌కు మెరుగైన ఫలితాలే వచ్చాయి. బుధవారం మహిళల్లో రెండు జట్లు విజయాలు సాధించగా, ఒక జట్టు డ్రా చేసుకుంది. పురుషులకు ఒక్కో విజయం, డ్రా, ఓటమి ఎదురయ్యాయి. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న భారత్‌-1 జట్టు 3-1తో జార్జియాపై అద్భుత విజయంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

జానిద్జెపై హంపి నెగ్గగా.. నినోతో గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది. వైశాలి.. లెలాను ఓడించింది. మెలియాతో గేమ్‌ను తానియా సచ్‌దేవ్‌ డ్రా చేసుకుంది. వంతిక, పద్మిని, మేరీ ఆన్‌గోమ్స్‌, దివ్య దేశ్‌ముఖ్‌ సభ్యులుగా ఉన్న భారత్‌-2 జట్టు 2-2తో చెక్‌రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అన్ని గేమ్‌లూ డ్రా అయ్యాయి. భారత్‌-3 జట్టు 3-1తో ఆస్ట్రేలియాపై నెగ్గింది. సాహితితో పాటు విశ్వ వసవాడ విజయాలు సాధించగా.. ఈషా కరవాడె, నందిద తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. భారత్‌-2, 3 జట్లు వరుసగా 11, 16 స్థానాల్లో ఉన్నాయి.

పురుషుల విభాగం తొలి అయిదు రౌండ్లలో అజేయంగా సాగిపోయిన భారత్‌-2 జట్టు.. తొలి ఓటమి ఎదుర్కొంది. ఈ బృందం 1.5-2.5 తేడాతో అర్మేనియా చేతిలో ఓటమి పాలైంది. సర్జిసియాన్‌ను గుకేశ్‌ ఓడించినా.. సామ్వెల్‌ చేతిలో అధిబన్‌, రాబర్ట్‌ చేతిలో రోనక్‌ ఓడిపోయారు. సరీన్‌ నిహాల్‌.. హ్రాంట్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఈ ఓటమితో అగ్రస్థానాన్ని కోల్పోయిన భారత్‌-2 మూడో స్థానానికి పడిపోయింది.

మరోవైపు హరికృష్ణ, అర్జున్‌, విదిత్‌, శశికిరణ్‌లతో కూడిన భారత్‌-1 జట్టు ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. భారత్‌-3 జట్టు 3.5-0.5తో లిత్వేనియాను ఓడించింది. సేతురామన్‌, అభిజిత్‌, అభిమన్యు విజయాలు నమోదు చేయగా.. సూర్యశేఖర గంగూలీ డ్రా చేసుకున్నాడు. భారత్‌-1, 3 జట్లు వరుసగా 6, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అర్మేనియా, అమెరికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news