భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ ప్రశంస

-

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెజ్లర్లు వరుస పతకాలతో ఆధిపత్యం కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగారు పతకం సాధించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తనను క్షమించండని భారత రెజ్లర్‌ పూజ గహ్లోత్‌ వాపోవడం ప్రతిఒక్కర్నీ కదిలించింది. దీనిపై స్పందించిన భారత ప్రధాని మోదీ .. ఇది వేడుక చేసుకునే సందర్భమని, బాధపడాల్సిన అవసరం లేదంటూ ప్రోత్సహిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇలా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను దేశ ప్రధానమంత్రి ప్రోత్సహిస్తుండడంపై పలు దేశాల పౌరులు సామాజిక మాధ్యమాల్లో సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై స్పందించిన ఓ పాకిస్థానీ జర్నలిస్ట్‌.. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. తన సొంత దేశ నాయకులకు మాత్రం క్రీడలు, క్రీడాకారుల పట్ల నిబద్ధత లేదంటూ విమర్శలు గుప్పించారు.

మహిళల 50 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన పూజ గహ్లోత్‌ కాంస్య పతకం సాధించారు. అయితే, బంగారు పతకాన్ని సాధించలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణలు కోరుతున్నానంటూ మీడియా సమావేశంలో పూజ కన్నీటి పర్యంతమయ్యారు.

దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. పూజ, మీరు సాధించిన పతకంతో వేడుకలు చేసుకోవాలి, క్షమాపణలు చెప్పడం కాదు. మీ జీవిత ప్రయాణం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేయడంతోపాటు మాకు ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. మీరు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారు. ఇలాగే మీ ప్రతిభను కొనసాగించండి’ అంటూ ప్రధాని మోదీ ప్రోత్సహించారు.

ఇలా అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరచే క్రీడాకారులకు ప్రధాని మోదీ భరోసా ఇవ్వడం పట్ల పాకిస్థాన్‌కు చెందిన ఓ షిరాజ్‌ హసన్‌ అనే జర్నలిస్ట్‌ ప్రశంసించారు. భారత్‌ తమ క్రీడాకారులను ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, అధ్యక్షుడి నుంచి అటువంటి ప్రోత్సాహకర మాటలు ఎప్పుడైనా చూశామా..? కనీసం వారికి పాకిస్థాన్‌ అథ్లెట్లు పతకాలు గెలుస్తున్నారనే విషయమైనా తెలుసా..? అంటూ సొంత నాయకులపై ప్రశ్నలు గుప్పించారు. ఇలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మోదీ చెప్పిన మాటలకు సామాజిక మాధ్యమాల్లో యూజర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news