ఇంగ్లండ్‌లోని నాటింగామ్ ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. బౌలర్లు విసిరిన ఫాస్ట్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 21.4 ఓవర్లలోనే విండీస్ బౌలర్లు పాకిస్థాన్‌ను చాప చుట్టేశారు.
మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ఏ దశలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఓపెనింగ్ నుంచి చివరి వరకు వరుస సెషన్లలో పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో ఫఖర్ జమాన్(16 బంతుల్లో 22 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్), బాబర్ అజాం (33 బంతుల్లో 22 పరుగులు, 2 ఫోర్లు), మహమ్మద్ హఫీజ్ (24 బంతుల్లో 16 పరుగులు, 2 ఫోర్లు), వహబ్ రియాజ్ (11 బంతుల్లో 18 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
ఇక విండీస్ బౌలర్లలో ఒషేన్ థామస్ 4 వికెట్లు తీయగా, కెప్టెన్ జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. అలాగే ఆండ్రూ రస్సెల్‌కు 2 వికెట్లు, షెల్డన్ కాట్రెల్‌కు 1 వికెట్ దక్కింది. ఈ క్రమంలో విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 106 పరుగులు చేయాల్సి ఉంది. కాగా పాకిస్థాన్‌కు వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకు ముందు 1992లో ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత ఇవాళ 105 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది.