టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ఫార్మాట్లలో తమదైన ముద్ర వేసి అంతర్జాతీయ క్రికెట్ లో మోడరన్ డే గ్రేట్స్ గా ఉన్నారు. కోహ్లి మూడు ఫార్మాట్లలో తన సత్తా చాటితే తాజాగా ముగిసిన సఫారీలతో టెస్ట్ సీరీస్ లో రోహిత్ టెస్టుల్లో కూడా తనకు తిరుగు లేదని నిరూపించాడు. ఓపెనర్ గా తన సత్తా ఏ స్థాయిలో ఉంటుందో పరిచయం చేసాడు రోహిత్. మొన్నటి వరకు మిడిల్ ఆర్డర్ లో ఆడిన రోహిత్ ఈ సీరీస్ తో టెస్టుల్లో కూడా ఓపెనర్ గా సెటిల్ అయిపోయాడు.
ఇక ఆదివారం నుంచి బంగ్లాదేశ్ తో మూడు మ్యాచుల టి20 సీరీస్ మొదలు కానుంది. ఈ సీరీస్ కి రోహిత్ ని కెప్టెన్ ని చేసారు. కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్న ఈ సీరీస్ లో కెప్టెన్ గా కూడా తన సత్తా చాటాలని రోహిత్ భావిస్తున్నాడు. అటు సెలెక్షన్ కమిటి కూడా అతనిపై గట్టి నమ్మకాన్నే ఉంచింది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు రోహిత్… పరుగుల్లో కోహ్లీని టార్గెట్ చేసాడు. కోహ్లి ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుతం 67 ఇన్నింగ్స్ ల్లో 2,450 పరుగులతో నెం.1 స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 90 ఇన్నింగ్స్ ల్లో 2,443 పరుగులతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచుల సీరీస్ లో రోహిత్ కేవలం 8 పరుగులు చేస్తే అతను టి20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా నిలుస్తాడు. రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (2,285 పరుగులు), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) టాప్ – 5 లో ఉన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా రోహిత్ శర్మకు బలంగా బంతి తాకడంతో అతను ఆడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం కాగా… ఇబ్బంది ఏం లేదని టీం ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది.