SRH vs MI మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియం వెళ్తున్నారా.. ఈ నిబంధనలు తప్పనిసరి!

-

హైదరాబాద్లో ఇవాళ రాత్రి జరగబోయే ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌ వేదికగా జరగబోయే తొలి మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే స్టేడియంలోకి మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని, వాటర్‌ బాటిల్స్‌, బ్యానర్స్‌, ల్యాప్‌ ట్యాప్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్‌ నిషేధమని చెప్పారు. బ్లూ టూత్స్ అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం లోపల తక్కువ ధరలకే తినుభండారాలు, త్రాగునీరు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

మ్యాచ్ కోసం 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని సీపీ వివరించారు. 39 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న స్టేడియం లోపల, 360సీసీ కెమేరాలను ఏర్పాటు చేశామని, వీటిని కమాండ్‌కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి కదలికను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. స్టేడియం వద్ద బ్లాక్‌ టికెట్స్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news