ఇవాళ జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్ష సూచన ఉందని అక్కడి స్టేడియం సిబ్బంది తెలిపారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే సౌతాఫ్రికా జట్టుపై గెలిచి మంచి ఉత్సాహం మీదున్న భారత్ నేడు కంగారూలను ఢీకొట్టనుంది. ఇవాళ లండన్‌లోని ది ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఇప్పటి వరకు టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించగా, భారత్ ఒక మ్యాచ్ ఆడి అందులో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి పాలవ్వలేదు. ఈ క్రమంలో ఇవాళ ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఆసక్తికర పోరు నెలకొంటుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
సఫారీలతో భారత్ ఆడిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రోహిత్ ఫాంలోకి రావడం ఇప్పుడు టీమిండియాకు ఎంతో బలాన్నిచ్చింది. ఇక భారత బౌలర్లు కూడా గత మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేస్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా పదునైన షార్ట్‌పిచ్ బంతులను వేసి సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, బౌలర్లు కూడా చక్కని ఫాంలో ఉన్నారు. ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న ది ఓవల్ మైదానం విషయానికి వస్తే.. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. ఇదే పిచ్‌పై ఆడిన బంగ్లాదేశ్ సౌతాఫ్రికాపై 330 పరుగులు చేసింది. అంటే.. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్, ఫించ్‌లు భారత్‌కు ప్రమాదకరంగా మారనున్నారు. ఇక ఆ జట్టు బౌలర్లలో స్టార్క్, కమిన్స్, స్పిన్ బౌలర్ ఆడం జంపాలు కూడా భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేందుకు తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక టాస్ గెలిచి భారత్ ఒక వేళ బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం 350 స్కోరు చేయాల్సి ఉంటుంది. లేదంటే రెండో సారి బ్యాటింగ్ చేసే టీంకు కూడా 300 వరకు పరుగులు సాధించే అవకాశం ఉంటుంది కనుక భారత్ ఈ విషయం జాగ్రత్త పడాలి. అయితే ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తే ఆ జట్టును 280 పరుగుల లోపే ఔట్ చేయాలి. దాంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది.
ఇక ఇవాళ జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్ష సూచన ఉందని అక్కడి స్టేడియం సిబ్బంది తెలిపారు. అలాగే బలంగా గాలులు కూడా వీస్తాయని తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌లో వరుణుడు కీ రోల్ ప్లే చేస్తాడని, ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే.. అది ఇరు జట్లపై ప్రభావాన్ని చూపిస్తుందని కూడా స్టేడియం సిబ్బంది అంచనా వేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో వర్షం పడకూడదని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. కంగారూల జోరుకు భారత్ అడ్డుకట్ట వేసి మ్యాచ్ లో గెలుస్తుందా.. లేదా.. అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది..!
ఇండియా (ప్రాబబుల్ ఎలెవెన్): రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా.
ఆస్ట్రేలియా (ప్రాబబుల్ ఎలెవెన్): డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, మార్టస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ కారే (వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.