మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం… కరోనాతో తల్లి, సోదరి మృతి

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోన్న విషయం తెల్సిందే. రోజుకు 4 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తమ ఆప్తులను దూరం చేస్తూ వేల కుటుంబాలలో కరోనా విషాదం నింపుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. తాజాగా భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కూడా కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది.

వేదా కృష్ణమూర్తి సోదరి వత్సల శివ కూమార్ కోవిడ్ బారిన పడి గురువారం మృతి చెందింది. అయితే వేదా కృష్ణమూర్తి తల్లి చెలువంబా దేవీ కూడా కరోనా బారినపడి రెండు వారాల క్రితం మరణించారు. వేదా కుటుంబం ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఇంట్లో మరో వ్యక్తి కరోనాతో చనిపోవడం బాధాకరం. కాగా కొద్ది రోజుల క్రితం వేదా కృష్ణమూర్తి తల్లికి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆమెను చిక్కమగళూరు జిల్లా(కర్ణాటక) కడూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఇదే సమయంలో వేదా కృష్ణమూర్తి కుటుంబంలోని కొందరి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు.