ఐపీఎల్ నుంచి గొప్ప ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో అదరగొడతాడని అంతా భావించారు. కానీ వరుసగా వైఫల్యాలే. గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లాడి చేసింది 5 పరుగులే. సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే.. అక్కడా నిరాశే ఎదురైంది. ఫైనల్లోనూ అతడి మీద ఆశలే లేవు. అయితే విరాట్ వైఫల్యం గురించి కెప్టెన్ రోహిత్‌ను అడిగితే.. ‘‘విరాట్ స్థాయి ఏంటో మాకు తెలుసు. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో అతనెలా ఆడతాడో తెలుసు. బహుశా ఫైనల్ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో’’ అన్నాడు.
కెప్టెన్ మాటలను నిజం చేస్తూ కోహ్లి నిజంగానే ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడి.. ఆపై చివర్లో చెలరేగి ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యే వరకు విరాట్ వేగంగా ఆడకపోవడం అభిమానులకు కొంత అసహనం తెప్పించినా.. భారత్ 34/3తో నిలిచిన దశలో.. ఇంకొక్క వికెట్ పడితే జట్టు ఎంత ఇబ్బంది పడేదనడంలో సందేహం లేదు. షాట్ల కోసం ప్రయత్నించి వికెట్ ఇస్తే ఏమవుతుందో తెలిసే.. కోహ్లి ఆ సాహసం చేయలేదు. మ్యాచ్ చివరి ఓవర్లకు వచ్చాక విరాట్ షాట్లకు ప్రయత్నించి విఫలమైనా.. ఆఖర్లో మాత్రం అదరగొట్టాడు. దీంతో భారత్ మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించి విజయం దక్కించుకుంది.