విండీస్ 212 ఆలౌట్‌.. మ‌ళ్లీ అదే ఆట తీరు..!

178

ఇంగ్లండ్ వేదిక‌గా సౌథాంప్ట‌న్‌లోని ది రోజ్ బౌల్‌లో జ‌రుగుతున్న ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 19వ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 44.4 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో నికోలాస్ పూర‌న్ (78 బంతుల్లో 63 ప‌రుగులు, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) మాత్ర‌మే రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ చెప్పుకోద‌గిన స్కోర్ చేయ‌లేదు. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, మార్క్ వుడ్‌లు చెరో 3 వికెట్లు తీయ‌గా, జో రూట్‌కు 2 వికెట్లు ద‌క్కాయి. అలాగే క్రిస్ వోక్స్‌, లియామ్ ప్లంకెట్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

కాగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆడిన విధంగానే వెస్టిండీస్ ప్లేయ‌ర్లు ఈ మ్యాచ్‌లోనూ టీ20 త‌ర‌హాలో ఆడారు. చెత్త షాట్లు ఆడుతూ వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. అంతే కానీ.. నిల‌క‌డ‌గా ఆడి భారీ స్కోరు చేద్దామ‌నే ఉద్దేశం వారిలో ఏ కోశానా క‌నిపించ‌లేదు. దీంతో వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్లే షాట్లు ఆడుతూ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చిక్కారు. మ‌రోవైపు ఇంగ్లండ్ బౌల‌ర్లు మాత్రం ఆచి తూచి బౌలింగ్ వేశారు. విండీస్ బ్యాట్స్‌మెన్ బౌండ‌రీల‌ను బాదుతూ ఇబ్బంది పెట్టేందుకు య‌త్నించినా వారు వికెట్ల‌ను తీయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. దీంతో విండీస్ త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయింది.