ఇక‌పై వాట్సాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు పెద్ద ఎత్తున పంపితే జైలుకే..!

288

వాట్సాప్ యాప్‌ను ఎవ‌రైనా దుర్వినియోగం చేసినా, లేదా ఆ యాప్‌లో గ్రూప్‌ల‌లో పెద్ద ఎత్తున మెసేజ్‌ల‌ను పంపినా.. ఇక‌పై అలాంటి వారిపై వాట్సాప్ చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనుంది.

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్‌లోని త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే న‌కిలీ వార్త‌లు, సందేశాల‌కు చెక్ పెట్టేందుకు ప‌లు ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై ఈ విష‌యంలో వాట్సాప్ మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఆ యాప్‌లో ఇక పెద్ద ఎత్తున గ్రూప్ మెసేజ్‌లు ఎవ‌రైనా పంపితే వారిపై వాట్సాప్ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనుంది.

వాట్సాప్‌లో గ్రూప్‌ల‌ను నిర్వ‌హించే వారు, వాటిల్లో స‌భ్యులుగా ఉన్న వారు ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఎందుకంటే వాట్సాప్ తాజాగా త‌న పాలసీలో ప‌లు మార్పుల‌ను తీసుకొచ్చింది. వాటి ప్ర‌కారం వాట్సాప్ యాప్‌ను ఎవ‌రైనా దుర్వినియోగం చేసినా, లేదా ఆ యాప్‌లో గ్రూప్‌ల‌లో పెద్ద ఎత్తున మెసేజ్‌ల‌ను పంపినా.. ఇక‌పై అలాంటి వారిపై వాట్సాప్ చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనుంది. అలాంటి వారిపై వాట్సాప్ ఫిర్యాదు చేసి వారిని జైలుకు పంపించ‌నుంది. కాగా ఈ నిర్ణ‌యం డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది.

ఇటీవ‌ల జ‌రిగిన దేశ వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో చాలా మంది వాట్సాప్‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు ఆ కంపెనీ గుర్తించింది. పెద్ద ఎత్తున ఆ యాప్‌ను క్లోన్ చేసి ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడుతూ.. చాలా మంది ఉద్దేశ పూర్వ‌కంగానే న‌కిలీ వార్త‌ల‌ను పంపేందుకు య‌త్నించార‌ని వాట్సాప్ నిర్దారించింది. అందుక‌నే ఇక‌పై గ్రూపుల్లో పెద్ద ఎత్తున పంప‌బ‌డే మెసేజ్‌ల‌పై గ‌ట్టి నిఘా ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌ల్క్ మెసేజ్‌ల‌ను పంపే వారిపై ఇక వాట్సాప్ చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు పూనుకుంటోంది. అయితే బ‌ల్క్ మెసేజ్‌ల‌ను పంపించేందుకు లిమిట్ ఏమిటో వాట్సాప్ వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది..!