టాంటన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో షై హోప్ (121 బంతుల్లో 96 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లూయీస్ (67 బంతుల్లో 70 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షిమ్రాన్ హిట్‌మైర్ (26 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. బంగ్లా బౌలర్లలో మహమ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రహమాన్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి. అలాగే షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు.
షై హోప్ సెంచరీ మిస్..
మ్యాచ్‌లో 96 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్న విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్ సెంచరీ చేయకుండానే ఔట్ అయ్యాడు. 47వ ఓవర్‌లో ముస్తాఫిజుర్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని హోప్ లెగ్ సైడ్ గాల్లోకి లేపాడు. కానీ అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో స్కేర్ లెగ్‌లో ఉన్న బంగ్లా ఫీల్డర్ లైటన్ దాస్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో హోప్ సెంచరీ మిస్ అయింది.
ఇక విండీస్ ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్ 3వ బంతిని ఆ జట్టు ఆటగాడు హిట్‌మైర్ సిక్సర్‌గా మలిచాడు. ఈ క్రమంలో బంతి 104 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం అవతల పడింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని తెచ్చారు. అయితే 43వ ఓవర్ 3వ బంతిని విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ సిక్స్ రూపంలో స్టాండ్స్‌కు తరలించగా.. అది 105 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఇదే సిక్స్ టోర్నమెంట్‌లో అతి పెద్ద సిక్స్‌గా నమోదు అయింది.