ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. క్షణక్షణం మలుపులతో కూడిన రాజకీయాలతో ఏపీ పాలిటిక్స్ నిత్యనూతనంగా దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మంత్రివర్గం విస్తరణ జరగనుంది. అందులో భాగంగా కొత్తగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ప్రమోషన్ లభించవచ్చనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.
ఈ క్రమంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వవచ్చనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అందులో బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఇక మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అయితే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రిగా తీసుకోనున్నారు! అలాగే.. ఆయనను మంత్రిగా ఉంచి, ఉపముఖ్యమంత్రి పదవి సీనియర్ అయిన కృష్ణదాస్ కు ఇవ్వవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తద్వారా మరో బీసీకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ధర్మాన ప్రసాద్ రావు గుర్రుగా ఉంటూ అప్పుడప్పుడూ పార్టీపైన చలోక్తులు విసురుతున్నారు. ఇప్పుడు అన్నకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తమ్ముడి మాటను కంట్రోల్ చేయవచ్చనే అభిప్రాయం కూడా ఉంది! అలాగే.. ఈ విషయాలపై రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మంత్రి ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా మరొకరు అదే జిల్లాకు చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రిపదవి వరించనుంది.