సిక్కోలు వైసీపీలో చిచ్చురేపిన పార్టీ అఫీస్

-

నిన్న మొన్నటి వరకు పదవులు దక్కక నేతల మధ్య దూరం పెరగడం అనేది కామన్..ఇక శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అధికార పార్టీ నాయకులకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వాడీవేడీ చర్చ జరుగుతూనే ఉంటుంది.వైసీపీ నేతల వివాదాల్లోకి ఇప్పుడు జిల్లా వైసీపీ ఆఫీస్‌ కూడా చేరిపోయింది.

సిక్కోలు జిల్లా వైసీపీలో అందరూ ముఖ్యనేతలే. కానీ.. ఏం లాభం ఆఫీస్‌ ఖర్చులకొచ్చేసరికి జేబులు తడుముకొంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఆ ఖర్చులు భరించిన నేత ఇప్పుడు చేతులు ఎత్తేశారు. దాంతో పార్టీ ఆఫీస్‌ మరోచోటుకు మార్చక తప్పలేదు. ఈ అంశంపై చర్చే కాదు.. రచ్చ కూడా జరుగుతోంది. జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి ధర్మాన కుటుంబం అండగా ఉంటోంది. శ్రీకాకుళం న్యూ కాలనీలో మొదట జిల్లా పార్టీ ఆఫీస్‌ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పార్టీ ఆఫీస్‌ బాధ్యతలు కృష్ణదాసే చూసుకునేవారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2013లో వైసీపీలో చేరిన తర్వాత దూకుడు పెరిగింది. పార్టీ ఆఫీసును టౌన్‌హాల్‌కు షిఫ్ట్‌ చేశారు ప్రసాదరావు. అన్నిరకాలుగా అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ ఎంత పెద్ద సమావేశం పెట్టుకున్నా ఇబ్బంది ఉండది కాదు. పార్టీ నేతలు రెడ్డిశాంతి, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ .. ప్రసాదరావే ఖర్చులు.. అద్దెను భరిస్తూ వచ్చారట. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టౌన్ హాల్‌లో అద్దెగొడవలు మొదలయ్యాయి. ప్రసాదరావుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ ఆయన అన్న కృష్ణదాస్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. తమ్మినేనిని స్పీకర్‌ను.. అప్పలరాజును మంత్రిని చేశారు. మంత్రి పదవి దక్కక ఒకింత అసంతృప్తితో ఉన్న ధర్మాన ప్రసాదరావు పార్టీ ఆఫీస్‌ నిర్వహణ భారం మోయలేనని చెప్పేశారట.

జిల్లానుంచి స్పీకర్‌, ఇద్దరు మంత్రులు ఉన్నా.. ఖర్చులు విషయానికి వచ్చేసరికి వారంతా జేబులు తడుముకొంటున్నారట. అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రసాదరావు కొంత మొత్తం చెల్లించినా.. ఇక తన వల్ల కాదని పక్కకు తప్పుకొన్నారు. ఇటు ప్రసాదరావు పట్టించుకోక.. అటు మిగిలిన నేతలు చేతులు ఎత్తేయడంతో టౌన్‌హాల్‌ భవనాన్ని ఖాళీ చేయాలని కోరారట ఆ బిల్డింగ్‌ యజమాని. దీంతో పార్టీ కార్యాలయం బాధ్యతలు మరోసారి భుజానికెత్తుకున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌.. సూర్యమహల్‌ జంక్షన్‌లోని ఓ భవనాన్ని పార్టీ ఆఫీసుగా తీసుకున్నారు.

ఈ మార్పులు.. చేర్పులే వైసీపీ నేతలు, శ్రేణుల్లో చర్చగా మారాయి. వైసీపీ ఏర్పాటైన నాటి నుంచి జిల్లాలో మూడుచోట్లకు పార్టీ ఆఫీస్‌ మార్చాల్సి రావడంపై చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ అద్దెల గోల ఏంటి జిల్లాలో టీడీపీకి సొంత భవనంలో ఆఫీసు ఉంది. అధికారంలో ఉన్నా సొంత భవనం ఏర్పాటు చేసుకోలేరా అని ప్రశ్నలు వేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news