పార్టీలో చీలిక దిశగా పరిణామాలు..టీపీసీసీ చీఫ్ ఎంపిక మళ్లీ వాయిదా

-

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక ప్రస్తుతానికి వాయిదా వేసే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్ఠానం. సీనియర్లు చాలామంది ఈ పీఠం కోసం పోటీ పడుతుండటం..రెండు వర్గాలుగా నేతలు విడిపోవడం వంటి పరిణామాలే ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్ధితులు ఏమీ బాగాలేవని అవగాహనకు వచ్చిన హైకమాండ్.. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే.. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తోంది.

టీ పీసీసీకి కొత్త బాస్ ఎంపిక.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పదవి కోసం 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించారు. తెలంగాణకు చెందిన ఎఐసీసీ నేతలు మొదలు జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించామన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ .. నివేదికను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేశారు.

టీపీసీ చీఫ్ రేసులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా ఠాగూర్ వద్దకు వెళ్లిన టీం…తాము సూచించిన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుంటే పార్టీలో పని చేయలేమని తేల్చి చెప్పింది. ప్రత్యర్థి రేవంత్ టీం కూడా తనకు పీసీసీ ఇవ్వకపోతే పార్టీ బతకడం కష్టమని చెప్పుకుంటూ వస్తుంది. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కొట్లాడితే… ప్రత్యామ్నాయ ఆలోచన కూడా పార్టీ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు సీనియర్లు…అవసరం అయితే జానారెడ్డి పేరు కూడా సూచించాలని భావిస్తున్నారు. మేడంని కలిసి ఇలాంటి ప్రతిపాదన తేవాలని చూస్తున్నారు.

ఆయితే రెడ్డి సామాజిక వర్గం మధ్య ఆధిపత్య పోరు జరిగితే ఏంటన్న వాదన కూడా ఉంది. నాన్ రెడ్డి అంటే బీసీ లకా..? బ్రాహ్మణ సామాజికవర్గం కొటలోకి వెళ్తుందా…. లేదంటే దళితుల కి వెళ్తుందా..? అనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారి తీస్తుంది. పీసీసీ కొత్త బాస్ ఎంపికకు ఇంత పోటీ వాతావరణం, పార్టీలో చీలిక దిశగా సాగుతున్న పరిణామాలను అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిస్ధిత్లో వెంటనే పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయడం సరికాదని భావిస్తోంది. రాష్ట్రంలో రానున్న కొన్ని ఎన్నికలపై ఇది ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఎంపిక ప్రక్రియను వాయిదా వేసే యోచనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news