శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు కాకుండా వారి ప్రదర్శనను బట్టి కాంట్రాక్టులు ఇవ్వడంపై సీనియర్ ప్లేయర్లు కొందరు శ్రీలంక క్రికెట్ బోర్డుపై గుర్రుగా ఉన్న విషయం విదితమే. అందులో భాగంగానే కొందరిని ఆ క్రికెట్ బోర్డు భారత్‌తో మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. అయితే సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తిస్తుండడంపై ముత్తయ్య మురళీధరన్ మండి పడ్డాడు.
ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు అలా కాంట్రాక్టులను ఇస్తుందని, ఆటను డబ్బుతో ముడి పెట్టకూడదని, కొందరు సీనియర్ ఆటగాళ్లకు డబ్బే ప్రధానమని, వారు కొత్త వారిని చెడగొడుతున్నారని.. మురళీధరన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై సీనియర్ ఆటగాళ్లయిన ఏంజెలో మాథ్యూస్, దిముత్ కరుణరత్నెలు స్పందించారు. వారు మురళీధరన్ వ్యాఖ్యలను ఖండించారు.
మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు సహేతుకంగా లేవని, ఆటకు తగిన ప్రతిఫలాన్ని ఆశించడం తప్పెలా అవుతుందని వారు అంటున్నారు. అయితే ఎన్ని వివాదాలు ఉన్నా సొంత జట్టు ఆటగాళ్లపై మురళీధరన్ అలా వ్యాఖ్యలు చేసి ఉండకూడదని పలువురు బోర్డు పెద్దలు కూడా అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది. అసలే లంక జట్టు ప్రదర్శన అస్సలు ఏమాత్రం బాగా లేదు. 2016 నుంచి వారు గత 5 ఏళ్లుగా 61 వన్డేలు ఆడితే వాటిల్లో కేవలం 26 వన్డేల్లోనే గెలుపొందారు. ఈ క్రమంలో ఆట పరంగా లంక జట్టు అంత బాగా ఏమీ ప్రదర్శన చేయడం లేదని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం భారత్ తో మ్యాచ్‌లలోనూ ఆటగాళ్లు కొత్త కావడం వల్ల భారత జట్టును ఢీకొనలేకపోతున్నారు. మొదటి మ్యాచ్‌లోనే మనకు అది స్పష్టంగా కనబడింది.
ఒకప్పుడు జయవర్దనే, సంగక్కర, మురళీధరన్ వంటి ప్లేయర్లు లంక జట్టును ఎన్నో సార్లు విజయాల బాట పట్టించారు. కానీ ఇప్పుడా జట్టు అపజయాల బాటలో నడుస్తోంది. దీనికి తోడు తాజాగా నెలకొన్న సంక్షోభం.. వెరసి లంక జట్టు ప్రదర్శనపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మరి తప్పులను సరిదిద్దుకుని శ్రీలంక మళ్లీ ఒకప్పటి జట్టులా మారుతుందా, లేదా పరిస్థితి ఇంకా దిగజారుతుందా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.