వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ విషయంలో మరో ట్విస్ట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. శ్రీనివాస్ కనిపించకపోవడంతో అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఇవ్వాలని సెషన్స్ కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఎన్ఐఏ అధికారులు అతణ్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు ఆరోపించారు. జగన్‌పై దాడి కేసును ఇటీవలే ఎన్‌ఐఏకు అప్పటిస్తు కోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా… శనివారం ఉదయం విజయవాడలోని జిల్లా కేంద్ర కారాగారం నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని అతణ్ని విశాఖ విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది.
అతణ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై తమకేమీ సమాచారం ఇవ్వలేదని నిందితుడి తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. దాడి కేసుని ఎన్‌ఐఏకు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీంతో ఏపీ తెదేపా నేతలకు కోడి కత్తి కేసు తీవ్ర తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. వైసీపీ సైతం తమ అధినేతపై దాడి చేసిన అసలు దొంగలు త్వరలోనే బయటకు వస్తారని తెదేపా పై విమర్శలు ఎక్కుపెట్టారు.