మాఘశుద్ధ పంచమి…వసంతపంచమి….దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి పుట్టిన రోజు. సరస్వతీ దేవి మూల నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే….జ్ఞానవంతులవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని ప్రతీతి. అమ్మ అనుగ్రహం ఉంటే చదువు కరతలామాలకం అవుతుంది. పరీక్షలన్నింటిలో విజయం వరిస్తుంది. సహజకవి పోతన రాసిన భాగవతంలో సామాన్యులు సైతం బీజాక్షరాలను పద్య రూపంలో చదువుకుని తల్లి అనుగ్రహం పొందాలని కింది పద్యాన్ని రాశారు…
”తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్ సుశబ్దంబుశో భిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్ జగన్మోహినీ
పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా”
ప్రతి నిత్యం ఈ పద్యం పిల్లలు చదువుకుంటే ముగురమ్మల కరుణ కటాక్షాలు పిల్లలకు లభిస్తాయి.
వసంత పంచమి రోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు.
వసంత పంచమి రోజు అమ్మ ద్వాదశనామాలు పారాయణం/శ్రవణం, లేదా జపం చేసుకుంటే లేదా తలుచుకుంటే చాలు అని అర్యోక్తి. ఆ నామాలు…
1. భారతి 2. సరస్వతి 3. శారద
4.హంసవాహిని 5. జగతీఖ్యాత 6. వాగీశ్వర
7. కౌమారి 8. బ్రహ్మచారిణి 9.బుద్ధి ధాత్రి
10. వరదాయిని 11. క్షుద్ర ఘంట 12. భువనేశ్వరి
వసంత పంచమినాడు ఇలా చేయండి !
వసంత పంచమి రోజున ప్రాత: కాలంలో నిద్రలేచి స్నానం ఆచరించి….తెల్లని వస్త్రాలను ధరించి..గంధము ధరించి.. ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి…అక్కడ పద్మము, శంఖము, చక్రము వేసి…పీట మీద సరస్వతీ దేవి ప్రతిమను కానీ ఫొటోని కానీ ఉంచి…ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫొటో ముందు మినప పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి…వత్తి పెట్టి…దీపం వెలిగించి…కొత్త పుస్తకాలను పెన్నును అక్కడ ఉంచి ఆరాధించాలి. తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి. మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పించాలి.
అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు. అన్నంతో చేసిన పర్వాన్నం వీటిని పాలతో వండితే మరింత శ్రేష్ఠం.
తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఇలా ఏదైనా మీశక్తి కొలది అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించాలి. ఓం సరస్వత్యైనమ: అనే మంత్రాన్ని భక్తితో, ఏకాగ్రతతో కనీసం 21సార్లు లేదా 108 సార్లు జపంచేస్తే చాలా విశేషం.
– కేశవ