రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి ఎవరు సాయం అందిస్తారు…? ఎవరైనా పక్కన ఉంటే ఓకే. మరి డబ్బులు లేని వాళ్ళు…? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎవరు వైద్యం చేస్తారు చెప్పండి…? అందుకే తెలంగాణాలో కెసిఆర్ సర్కార్ ఇప్పుడు సరికొత్త ఆలోచనతో వార్కి అండగా నిలవాలని భావిస్తుంది. తెలంగాణ స్టేట్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఇనీషియేటివ్ (టీఏఈఐ)’ పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గాయపడిన బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో మూడు రోజుల పాటు ఉచిత చికిత్స అందిస్తారు. రోడ్లు భవనాలు, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ల ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈ తరహా వైద్యం దేశంలో ఇప్పటి వరకు కేవలం తమిళనాడులో మాత్రం ఉండేది.
ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని సమీపంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్తే మూడు రోజుల పాటు ఉచితంగా వైద్య సేవలందిస్తారు. ఏ ప్రాంతంలో అయినా ఇది వర్తిస్తుంది. దీనిపై నిధులకు సంబంధించి కూడా చర్చ జరగగా కొత్త వాహనాల రిజిష్ట్రేషన్ సమయంలోనే సెస్ లేదా ట్యాక్స్ విధించాలనే చర్చ కూడా అధికారుల మధ్య జరిగినట్టు సమాచారం.
ప్రస్తుతం ఎడ్యుకేషన్, స్వచ్ఛభారత్ ట్యాక్స్ ఏ విధంగా అయితే వసూలు చేస్తున్నారో, రోడ్డు ప్రమాద బాధితుల ఉచిత చికిత్స కోసం కొత్త వాహనాల కోసం కూడా ప్రజల నుంచి కొంత మొత్తం సెస్ విధించే అవకాశాలు ఉన్నాయి. దీనిని ఆరోగ్య శ్రీతో అనుసంధానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఆరోగ్య శ్రీలో లేని ఆస్పత్రికి వెళ్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి, ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఉచిత చికిత్స చేస్తారు.