తెలంగాణలోని ఈ ఏడాది పదో తరగతి పరీక్ష రాయనున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 23 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు రెడీ అయ్యాయని, వాటిని సోమవారం నుంచి స్కూళ్లకు పంపించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు వెల్లడించారు. వారంలోపు అన్ని స్కూళ్లకు చేరుతాయని కృష్ణారావు తెలిపారు. నాలుగైదు రోజుల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్లోనూ హాల్ టిక్కెట్లను అందుబాటులో పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా టెన్త్ హాల్‌టికెట్ నెంబర్‌తో పాలిసెట్‌కు అప్లై చేసుకునే అవకాశం ఉండటంతో, సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది. అంతేకాకుండా.. వేసవికాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. విద్యార్థులకు ఎలాంటి.. ఇబ్బందులు తలెత్తకుండా.. విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. కరోనా నిబంధనలను కూడా పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.