ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ఈ సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది కార్ నికోబార్ దీవికి వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాధారణంగా మే నెలలో తుపాన్లు తీరానికి దగ్గరగా వచ్చినప్పటికీ తీరం దాటడం అరుదు. కానీ.. ఇవి నేరుగా తీరంవైపు వచ్చి దిశ మార్చుకుని వెళ్లిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల వర్షాలుంటాయని.. అంతేకాకుండా.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.