మనిషి చేస్తున్న అనేక తప్పిదాల వల్ల ప్రస్తుతం పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. అనేక రకాల కాలుష్యాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. అయినప్పటికీ మనిషి అలా ముందుకు సాగుతున్నాడే కానీ తన తప్పులను సరిదిద్దుకోవడం లేదు. అయితే నిజంగా పర్యావరణాన్ని రక్షించాలనుకునే వారు నెట్ ఫ్లిక్స్‌లో వీడియోలను హెచ్‌డీలో చూడడం ఆపినా సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏంటీ.. నెట్‌ఫ్లిక్స్ కు పర్యావరణానికి సంబంధం ఏమిటనుకుంటున్నారా ? అవును.. సంబంధం ఉంది.
భూమిపై మనం చేసే చిన్న చిన్న పనులే కర్బన ఉద్గారాలు వెలువడేందుకు కారణమవుతున్నాయి. వాటిల్లో అధునాతన గ్యాడ్జెట్లను వాడడం కూడా ఒకటి. వీటి వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. మనం వాటిని చాలా తక్కువగా వాడితే పర్యావరణంపై కూడా ప్రభావం తక్కువగా పడుతుంది. దీంతో పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అందులో భాగంగానే యూకేకు చెందిన రాయల్ సొసైటీ వారు చెబుతున్నదేమిటంటే.. పర్యావరణాన్ని, భూగ్రహాన్ని రక్షించాలనుకునే వారు తాము చూసే నెట్ ఫ్లిక్స్ వీడియోల క్వాలిటీని హెచ్‌డీ నుంచి స్టాండర్డ్ డెఫినిషన్ కు మార్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
ఇక వారు చెప్పిన ప్రకారం క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మనుగడలో ఉండాలంటే ఒక్క స్విట్జర్లాండ్ దేశానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి దానికి అవసరం అని వెల్లడైంది. మనం నెట్ ఫ్లిక్స్ లో హెచ్‌డీలో వీడియోలను చూడడం ఆపినా లేదంటే గ్యాడ్జెట్ల వాడకాన్ని బాగా తగ్గించినా పర్యావరణంలోకి డిజిటల్ టెక్నాలజీ వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను 5 శాతం వరకు తగ్గించవచ్చని, దీంతో పర్యావరణంపై చెప్పుకోదగిన ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు.