పిఠాపురం వైసీపీకి కరోనా పెద్దకష్టమే తీసుకొచ్చిందా?

-

ఆ ఎమ్మెల్యేకి కరోనా సోకితే..అది ఆయన పీఏకి కలిసొచ్చిందట. ఇదే మంచి టైమ్‌ అనుకుని… షాడో ఎమ్మెల్యేగా మారిపోయాడట సదరు పీఏ. మరి.. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలుసో లేదో కానీ.. యవ్వారం మాత్రం శ్రుతిమించి రాగాన పడుతోందట. పెండెం దొరబాబు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే. దొరబాబు కోవిడ్‌ బారిన పడటంతో బెంగళూరులో చికిత్స తీసుకుంటూ.. కొన్నాళ్లు ప్రజలకు కొంచెం దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక్క ఇక్కడి నుంచి పిఠాపురం వైసీపీలో జరుగుతున్న సంఘటనలు ఎమ్మెల్యేకి కొత్త టెన్షన్ పెడుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు దొరబాబుకు టికెట్‌ రాకుండా ప్రయత్నించిన పార్టీలోని ఓ వర్గం.. ప్రస్తుతం సదరు పీఏకు ప్రాధాన్యం ఇస్తోందట. అయితే ఇదే మంచి సమయం అనుకున్న ఆయన పర్సనల్‌ పీఏ.. షాడో ఎమ్మెల్యేగా మారిపోయారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పిఠాపురంలో ఏ పని జరగాలన్నా పీఏ అనుమతి కావాలని.. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. ఎమ్మెల్యే వెంట నడిచిన ఆయన అభిమానులు.. తమకు గుర్తింపు లేకుండా పోతోందని వాపోతున్నట్టు సమాచారం. ఇదే విషయమై ఇటీవల పిఠాపురంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో వైసీపీ నాయకులు రోడ్డెక్కారు. అంతా షాడో ఎమ్మెల్యే దయేనని నిట్టూర్పులిడిచారు.

ప్రస్తుతం ఈ పంచాయితీ పార్టీ పెద్దల దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది. అయినా.. పిఠాపురంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సచివాలయ సిబ్బందిని చెప్పుచేతల్లో ఉంచుకుని ఆడిస్తున్నట్టు పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వార్డు వాలంటీర్ల నియామకాలతో తన మాట నెగ్గే విధంగా పార్టీ గ్రామల ఇంఛార్జ్‌లకు అనధికార ఆదేశాలు పంపించారట. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు ఎవరైనా ఉంటే.. అందులో కమీషన్‌ అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ షాడో ఎమ్మెల్యే బాగోతాలు ఎమ్మెల్యే దొరబాబుకు తెలుసా లేదా అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నారట. పైగా ఎమ్మెల్యే అందరినీ ఈజీగా నమ్మేస్తారని.. దానివల్ల కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారట. ఎమ్మెల్యే అంటే వీరాభిమానం ఉన్నవారు మాత్రం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట. తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆధారాలతో సహా వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట.

మొత్తానికి కరోనా పిఠాపురం వైసీపీకి పెద్ద కష్టమే తీసుకొచ్చిందని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరులు పరిస్థితులు ఎప్పుడు కుదుటపడతాయో అని ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ షాడో ఆగడాలకు.. పార్టీ కేడర్‌ కలవరపాటుకు వైసీపీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news