ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే మ్యాచ్ టై అవుతుంది. అలాంటప్పుడు క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఏం చేస్తాడు? బౌండరీకి ప్రయత్నిస్తాడు. లేదా బంతిని బాది ఎలాగైనా రెండు పరుగులు చేసేందుకు రిస్క్ తీసుకుంటాడు. మరి బ్యాటుకు తాకకుండా ఆ బంతి కీపర్ చేతుల్లో పడితే సింగిల్‌కు అవకాశం ఉంటే ఉంటుంది. లేదంటే లేదు. కానీ యూరోపియన్ లీగులో ఓ జట్టు విచిత్రంగా 2 పరుగులు చేసింది. పాక్సిలోనా సీసీ , కాటలున్య టైగర్స్ టీ10 మ్యాచులో తలపడ్డాయి. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పీసీసీ 9.5 ఓవర్లకు 105 పరుగులతో నిలిచింది.
ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే మ్యాచ్ టై అవుతుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ అదాలత్ అలీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించినా బంతి తప్పించుకొని కీపర్ చేతుల్లో పడింది. అప్పటికే నాన్‌స్ట్రైకర్ అజీమ్ ఆజామ్ పరుగెత్తుకొచ్చాడు. బ్యాటర్ అటువైపు వెళ్లాడు. ఒక పరుగు లభించింది. బంతేమో కీపర్ చేతుల్లో ఉంది. అయినా మరో పరుగు లభించింది. కీపర్ వైపు పరుగెత్తుకొచ్చిన నాన్‌స్ట్రైకర్ అజీమ్ అక్కడే క్రీజులో ఉండి అవతలి ఎండ్‌కు వెళ్లిన స్ట్రైకర్ అలీని రమ్మన్నాడు. అతడు పూర్తిగా వచ్చే వరకు బంతిని చేతుల్లోనే ఉంచుకున్న కీపర్ దానిని బౌలర్‌కు విసిరాడు. అతడు బంతిని వికెట్లకు విసరడంలో విఫలమవ్వడంతో రెండో పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది.