తెలంగాణలో వీధికుక్కల బీభత్సం.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురికి గాయాలు

-

తెలంగాణలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు మీదపడి కరుస్తున్నాయి. గుంపులు గుంపులుగా రౌండప్ చేసి మరీ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలే ఓ నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం కుక్కల దాడుల కట్టడిపై చర్యలకు కూడా ఉపక్రమించింది. అయినా వీధికుక్కల దాడులు మాత్రం తగ్గడం లేదు.

తాజాగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న జర్పుల భానుశ్రీ(17 నెలలు)పై వీధి కుక్క దాడి చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బొల్లె శరీష్మ(4) గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో శుక్రవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాహనం అదుపు తప్పి కింద పడ్డవారికి ఓవైపు గాయాలు కాగా.. మరోవైపు వారిపై కుక్కలు దాడిచేశాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం పదేళ్ల బాలుడు చెర్రిపై వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news