దేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 18న తుది వాదనలు వింటుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా పేర్కొన్న సుప్రీం.. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణను తమ వెబ్‌సైట్ సహా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పింది.
ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించలేమని తేల్చిచెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగ సంపర్కుల పెళ్లిళ్లు పూర్తిగా విరుద్ధమైనవని.. భారత కుటుంబవ్యవస్థతో పోల్చలేమని స్పష్టం చేసింది. వాటిని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.
”స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే.. సున్నితమైన పర్సనల్ చట్టాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. అందరూ పాటిస్తున్న సామాజిక, సాంస్కృతిక నియమాలకు భంగం కలుగుతుంది. వ్యక్తిగత చట్టాలలో ఇలాంటి వాటిని గుర్తించడం గాని.. అమలు చేయడం గాని సాధ్యం కాదు. ఇలాంటి వివాహాలకు ఇదివరకే సెక్షన్ 377 ఉంది. వీటికి మళ్లీ ప్రాథమిక హక్కు కింద పిటిషనర్లు కోరడం తగదు.” అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.