శివసేన ఎవరిదో తేల్చే బాధ్యత ఈసీదే : సుప్రీం కోర్టు

-

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. శివసేన తమదేనంటూ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేతో పోరాటం చేస్తున్న ఠాక్రేకు గట్టి షాక్ ఇచ్చింది. శివసేన గుర్తు కేటాయింపుపై నిర్ణయం తీసుకోకుండా ఈసీని ఆపాలంటూ ఠాక్రే వర్గం చేసిన విజ్ఞప్తిని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.

పార్టీ కేడర్‌ మొత్తం తమ వెంటే ఉన్నందున.. శివసేన గుర్తు తమకే కేటాయించాలని శిందేవర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఠాక్రే పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ డి.వై చంద్రచూడ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. శిందే అభ్యర్థనపై ఈసీ నిర్ణయం తీసుకునేందుకు అనుమతించింది.

జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన శిందే.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జూన్‌ 30న శిందే మహారాష్ట్ర సీఎంగా, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణం చేశారు. మరోవైపు ఈసీ వెలువరించే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఠాక్రే వర్గం నేత, ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. శిందే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.. ‘రూల్ ఆఫ్ మెజారిటీ’ ప్రకారం శివసేన ఎవరిదనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news