27న సుప్రీంలో MLC కవిత పిటిషన్‌ విచారణ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ఇంటి వద్ద లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారణ మొదట ఈనెల 24(ఇవాళ) చేపడతానని ధర్మాసనం పేర్కొంది. కానీ ఇవాళ్టి విచారణ జాబితాలో ఈ కేసు లేదు. ఈనెల 27 కవిత కేసు విచారణకు రానున్నట్లు తెలిసింది.

ఈ కేసులో ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ 16వ తేదీన మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పులు, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 16వ తేదీన విచారణకు హాజరుకావాలనే నోటీసులు రద్దు చేయాలని కోరారు.

తాము దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఎదుట కవిత తరఫు న్యాయవాదులు గత బుధవారం ప్రస్తావించారు. వెంటనే విచారణకు అంగీకరించని ప్రధాన న్యాయమూర్తి.. ఈ నెల 24న విచారించే కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీకి సూచించారు. అయితే, శుక్రవారం జాబితాలో ఈ కేసు లేదు. ఈ నెల 27వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news