ఉరి కంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై సమాచారంతో తిరిగి కోర్టుకు రావాలని అటార్నీ జనరల్ వెంకటరమణికి స్పష్టం చేసింది. ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉరిశిక్షకు బదులుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుత్ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.