బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. సుశాంత్ మృతికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఫిర్యాదు చేయగా.. బీహార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
కాగా సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని గతంలో రియానే కోరింది. కానీ సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టేసరికి ఆమె యూటర్న్ తీసుకుంది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని చెప్పింది. అదే విషయాన్ని కోర్టులో తెలపడంతోపాటు తన పిటిషన్‌లోనూ పేర్కొంది. ముంబై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని, కనుక సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. అయితే కోర్టు రియా వాదనను తోసిపుచ్చింది. సుశాంత్ కేసును సీబీఐ దర్యాప్తు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ రాయ్ తీర్పు ఇచ్చారు.
ఇక సుప్రీం కోర్టు తాను ఇచ్చిన తీర్పును మళ్లీ రివ్యూ చేసేందుకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లేదని తెలిపింది. ముంబై పోలీసులు సీబీఐకి పూర్తిగా సహకరించాలని, బీహార్ పోలీసులు కేసు దర్యాప్తును సరిగ్గానే చేపట్టారని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సందర్బంగా సుశాంత్ కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. సుశాంత్ కుటుంబానికి న్యాయం చేయడం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, అందువల్లే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తనకు ఉన్న సర్వాధికారాలను ఉపయోగించి సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిందన్నారు. ఈ కేసులో భాగంగా నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను సీబీఐ సేకరించి కేసు దర్యాప్తు చేస్తుందన్నారు. తీర్పు తమకు అనుకూలంగా రావడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారన్నారు. తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.