టీమ్‌ఇండియాలో ఎంఎస్ ధోని, సురేశ్ రైనాలకు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెల్సిందే. ధోని టెస్టులకు వీడ్కోలు పలికినప్పుడు కూడా మొదట ఆ విషయాన్ని చెప్పింది రైనా(Raina)కే. ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే సురేశ్ రైనా కూడా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా ఐపీఎల్ విషయంలోనూ అదే బాటలో పయణిస్తానని రైనా చెప్పాడు.
వచ్చే ఐపీఎల్‌లో ఒకవేళ ధోని ఆడకపోతే తాను కూడా ఐపీఎల్‌కు దూరమవుతానని సురేశ్ రైనా స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ సీఎస్‌కే గెలిస్తే వచ్చే సీజన్ ఆడేందుకు ధోని భాయ్‌ను ఒప్పిస్తానని తెలిపాడు. ధోనిని ఒప్పించే విషయంలో సఫలం అవుతానని తనకు నమ్మకముందని పేర్కొన్నాడు. 2008 నుంచి తాము సీఎస్‌కేకు ఆడుతున్నామని.. వచ్చే ఏడాది మరో రెండు జట్లు రాబోతున్నాయని.. అయితే తాను సీఎస్‌కేకు మాత్రమే ఆడతానని అనుకుంటున్నట్లు చెప్పాడు. సెప్టెంబర్లో జరగనున్న ఐపీఎల్ రెండో దశలో తాము రాణిస్తామని ఈ సందర్భంగా రైనా ధీమా వ్యక్తం చేసాడు.