హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించదనే ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. దీంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి విస్తృతమైన ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఖండించారు.
నగరంలో ఎక్కడా రెడ్ జోన్ ప్రకటించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం రెడ్ జోన్లు ప్రకటించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. కొందరు మార్ఫింగ్ చేసిన ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ జోన్లు లేవని తెలిపారు. చందానగర్, ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.