పాలు, ఖర్జూరాలు.. రెండూ చక్కని పోషక విలువలు ఉన్న ఆహారాలు. ఈ రెండింటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. ఇక ఖర్జూరాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలతో 2 లేదా 3 ఖర్జూరాలను తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్ పాలలో నాలుగైదు ఖర్జూరాలను వేసి సన్నని మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత తయారయ్యే మిశ్రమాన్ని తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. పాలు, ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోజూ మలబద్దకంతో బాధపడేవారు ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.
2. పాలు, ఖర్జూరాల మిశ్రమం గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఈ రెండింటి ద్వారా పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ అందుతాయి. దీంతో రక్తనాళాలు వెడల్పు అవుతాయి. ఫలితంగా బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. గర్భంతో ఉన్న మహిళలు పాలు, ఖర్జూరాలను కలిపి రోజూ తీసుకోవాలి. దీని వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శిశువు ఎదుగులకు సహాయ పడుతుంది.
4. ఖర్జూరాలు తియ్యంగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకూడదని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ఖర్జూరాలు తియ్యగా ఉన్నా వీటి ద్వారా వచ్చే సహజసిద్ధమైన చక్కెర రక్తంలో అంత త్వరగా కలవదు. అందువల్ల వీటిని డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. దీని వల్ల శక్తి అందుతుంది.
5. నీరసం ఉన్నవారు పాలు, ఖర్జూరాల మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం ద్వారా పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కాల్షియం అందుతాయి. దీంతో నీరసం తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.