మనకు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు సీజన్లు మారినప్పుడు వస్తాయి. అయితే చలికాలంలో మనకు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో సహజంగానే మనకు శరీర రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల కింద తెలిపిన పదార్థాలు ఈ సీజన్‌లో తరచూ తీసుకోవాలి. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిని నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అయితే వీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నిత్యం అలాగే తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి రెబ్బలను అలాగే పరగడుపున తింటే ఫలితం ఉంటుంది.
అల్లం, తేనె
ఈ రెండింటిలోనూ అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. వాపులను తగ్గిస్తాయి. ముక్కు దిబ్బడ, ఇతర శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. కొద్దిగా అల్లం రసంలో తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది.
తాజా కూరగాయలు
తాజా కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి మనల్ని అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి. పాలకూర, మెంతికూర తదితర ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
పసుపు
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక చిటికెడు పసుపును కలుపుని నిత్యం తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మనల్ని అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి.