కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు మరింత భయపడిపోతున్నారు. కరోనా వైరస్ మన శరీర శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి క్రమంగా మనల్ని ప్రాణాపాయ స్థితిలోకి నెడుతుందని తెలిసిందే. అయితే అప్పటి వరకు సుమారుగా 15 రోజుల సమయం పడుతుంది. కానీ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక కేవలం 5 రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయి కనుక మనం ప్రాణాపాయ స్థితి రాకుండా చూసుకోవచ్చు. అయితే వైరస్ మన శరీరంలోకి రాకుండా ఉండాలంటే.. మన శరీర రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. కానీ కొందరికి ఆ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు కింద సూచించిన ఆహారాలను తీసుకుంటే దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగి తద్వారా కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. మరి శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
సిట్రస్ ఫ్రూట్స్…
నారింజ, నిమ్మ, బత్తాయి, కివీలు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి తదితర పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అవి చురుగ్గా పనిచేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లపై ఆ రక్తకణాలు పోరాడుతాయి. మనకు వ్యాధులు, వైరస్‌ల నుంచి రక్షణ అందిస్తాయి. మనం తినే ఆహారాల్లో నిమ్మరసం కలుపుకోవడం ద్వారా మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
ఎరుపు రంగు క్యాప్సికం…
సిట్రస్ ఫ్రూట్స్ కన్నా వీటిల్లో విటమిన్ సి రెండు రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ సి ఇంకా ఎక్కువగా అందుతుంది. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బ్రకోలి…
బ్రకోలిలో విటమిన్ ఎ, సి, ఇ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
వెల్లుల్లి…
వెల్లుల్లిలో యాల్లిసిన్ అనబడే పోషక పదార్థం ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది.
అల్లం…
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను దూరం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
పాలకూర…
పాలకూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
పెరుగు…
పెరుగులో ఉండే విటమిన్ డి శరీర రోగ నిరోధక వ్యవస్థలో ఉండే లోపాలను సరిచేసి ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.
బాదంపప్పు…
బాదంపప్పులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఔషధంలా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
పసుపు…
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.
గ్రీన్ టీ…
గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి.