తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. సోమవారం ఉదయం విజయడవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆర్కే కాలేజీలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి విచ్చేసిన తలసానికి ఆర్కే కాలేజ్ ఛైర్మన్ ఎం.కొండయ్య, ఇతర యాదవ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్కే కాలేజ్ నుంచి కనక దుర్గ ఆలయం వరకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఐదు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ… తెలంగాణలో యాదవులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, చట్ట సభల్లో యాదవులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆంధ్రలో యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీలో రాజకీయం కులాల ప్రాతిపదికన నడుస్తున్నాయని విమర్శించారు. అసలు కులాల కుంపటిని చంద్రబాబు నాయుడే రాజేశారని ఆయన విమర్శించారు.