ల‌క్ అంటే ఈయ‌న‌దే.. అంద‌రికీ విందు భోజ‌నం పెట్టి కోటీశ్వ‌రుడు అయ్యాడు..!

-

అందరు రైతుల్లాగే అత‌నికీ ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. అయితే అందరిలా అత‌ను వేద‌న చెంద‌లేదు. విందు భోజ‌నం పెట్టి కోటీశ్వ‌రుడు అయ్యాడు.

వెంకటేష్‌ హీరోగా నటించిన ఒకప్పటి చినరాయుడు మూవీని చాలా మంది చూసే ఉంటారు. అందులో హీరోయిన్‌ విజయశాంతి తాను చేసిన అప్పు కట్టే స్థోమత లేకపోతే తమ ఊర్లో ఉన్న అందరికీ భోజనం పెట్టి వారిచ్చే డబ్బుతో అప్పు కట్టాలని చూస్తుంది. అయితే అది సినిమాయే అయినా.. నిజ జీవితంలో అలాంటి ఘటనలు జరగడం చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. తమిళనాడులోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

tamil nadu farmer arranged dinner and got rs 4 crores

తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరమంగళం తాలూకా వడగాడు అనే గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తికి ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. పంట కోసం డబ్బులు పెట్టడమే కానీ.. ఏనాడూ దాంతో లాభాలు పొంది అప్పు తీర్చే అవకాశం అతనికి రాలేదు. దీంతో తన అప్పులను తీర్చడం కోసం అతను ఆ గ్రామంలోని అందరికీ విందు భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా విందు ఏర్పాటు చేశాడు. అందుకు గాను తనకు తెలిసిన వారితోపాటు ఆ గ్రామం, దాని చుట్టు పక్కల ఉండే పలు గ్రామాలకు చెందిన వారికి మొత్తం కలిపి 50వేల కార్డులను అతను ప్రింట్‌ చేయించి అందరినీ ఆ కార్డులను ఇచ్చి తన విందుకు రమ్మని ఆహ్వానించాడు.

అయితే కృష్ణమూర్తి మరీ అంత సాధారణ విందేమీ పెట్టలేదు. వచ్చిన వారికి చికెన్‌, మటన్‌ సహా అనేక రకాల పదార్థాలతో షడ్రసోపేతమైన విందు పెట్టాడు. అందుకు గాను అతనికి రూ.15 లక్షలు ఖర్చయింది. ఇక విందు ఆరగించిన వారు అతనికి భారీగా కానుకలు ఇచ్చారు. దీంతో ఆ కానుకలు, డబ్బును లెక్కించడానికి కృష్ణమూర్తి ఓ దశలో సమీపంలో ఉన్న బ్యాంకు సిబ్బంది సహాయం కూడా తీసుకున్నాడు. అలాగే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో చివరకు ఎలాగో ఆ కానుకలు, డబ్బును లెక్కించగా మొత్తం రూ.4 కోట్లు వచ్చినట్లు తేలింది. దీంతో కృష్ణమూర్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కష్టాలు తీరడంతోపాటు ఇక ఏ లోటు లేకుండా జీవితం కొనసాగించడానికి అవసరమైనన్ని డబ్బులు వచ్చే సరికి అతను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఒక్క విందు భోజనంతో కృష్ణమూర్తి అలా కోటీశ్వరుడు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవును మరి.. దేవుడు కరుణిస్తే.. కొన్ని సందర్భాల్లో లక్‌ ఉంటే.. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా కృష్ణమూర్తి తెలివికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news