తమిళనాడుకు హై అలెర్ట్: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

తమిళ నాడును భారీ వర్షాలు వదిలిపెట్టడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2015 తర్వాత ఇవే భారీ వర్షాలు అంటూ ఐఎండీ తెలిపింది. నాగపట్టణంలో, కారైకల్ జిల్లాల్లో నిన్న అత్యధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వరదల కారణంగా ఐదుగురు మృతి చెందినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు వాయగుండం ప్రమాదం తమిళనాడుకు పొంచి ఉంది. నేడు అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలుపింది. ఇది తమిళనాడు తీరంవైపు ప్రయాణిస్తుందని హెచ్చిరిస్తోంది. దీంతో రానున్న మరో నాలుగు రోజులు తమిళనాడులో మరిన్ని వర్షాలు కురవనున్నాయి. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 28 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వీటితో పాటు తీర ప్రాంత జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలోని నెల్లూరులో కూడా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.