పలాస 1978 అనే సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్ర వర్ణ ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా, నిమ్న వర్గాల్లో ఆలోచన రేకెత్తేలా తెరకెక్కించిన పలాస.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్‌గా ఏమంత ప్రభావం చూపించడం లేదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని మాత్రం కురిపించలేకపోతోంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఫైర్ అయ్యాడు.
పలాస సినిమాలో ఎవ్వరూ నటించలేదని అందరూ జీవించారని అన్నాడు. డైలాగ్స్ రాసినట్లుగా లేదని.. ఎవరికి వారు సొంతంగా మాట్లాడుకున్నంత సహజంగా ఉందని కితాబిచ్చాడు. మంచి సినిమాలు కావాలి అంటారు.. తీస్తే చూడరని ఫైర్ అయ్యాడు. ఈ సినిమాలో దళారులను ఒకప్పుడు ఎలా చూసేవాళ్లు అని చూపించారని.. మరి వాళ్లే సినిమాను చూడకపోతే ఇంకెవరు చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో ఎవ్వరినీ ఎక్కువ చేసి చూపించలేదని.. ఎవ్వరినీ తక్కువ చేసి చూపించలేదన్నాడు.
తాను ఎన్నో సినిమాలు తీసానని అందులో కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి.. తన సినిమాలు ఆడకపోతే ఎప్పుడూ బాధపడింది లేదని తెలిపాడు. కానీ ఈ సినిమా ఆడకపోతే కచ్చితంగా బాధపడతానని అన్నాడు. ఈ సినిమాను మీరు చూడకపోతే ఇక ఇండస్ట్రీలో మంచి సినిమాలే రావని చెప్పుకొచ్చాడు. సినిమా చూడకపోవడం మీ ఖర్మ అనే చెబుతానని పేర్కొన్నాడు. ఇదంతా కోపంతో కాదు బాధతో చెప్తున్నానని తెలిపాడు. దయచేసి ఇలాంటి సినిమాలను బతికించండని కోరాడు. డబ్బుల కోసం ఈ సినిమాను తీయలేదని.. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి అనుకున్నామని అన్నాడు. మాకు డబ్బులు రాకపోయినా ఫర్వాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు