తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని రాతలను ఎక్కువగా నమ్మే వారు. పార్టీలో చంద్రబాబుకి సన్నిహితంగా మెలిగే కొందరు హడావుడి సంఘం సభ్యులు చంద్రబాబుకి భజన చేయడంతో పాటుగా పార్టీ పరిస్థితి ఇదీ లోకేష్ పరిస్థితి ఇదీ అంటూ కీర్తిస్తూ రాతలు రాసే వారు. ఇక టీడీపీ అనుకూల వెబ్‌సైట్స్‌లో కూడా వాటిని ప్రచురించి విస్తృతంగా ప్రచారం చేసే వారు. లోకేష్ గురజాల వెళ్తే అక్కడకు వెళ్ళిన ఫోటోలు తీసుకుని హడావుడి చేశారు. ఇక కడప జిల్లా వెళ్తే లోకేష్ దెబ్బకు కడప తెలుగుదేశం ఖిల్లా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆ వ్యాఖ్యలను, కింద జనం పెట్టె ఆహా ఓహో కామెంట్లను చంద్రబాబుకి ఒక బృందం ప్రత్యేకంగా చూపిస్తూ సందడి చేస్తూ ఉండేది. ఆ తర్వాత వాళ్లకు చంద్రబాబు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. చివరికి ఇప్పుడు కూడా అదే భజన పార్టీలో జరుగుతోంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆ భజనకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా విజయవాడలో ఉండే కొందరు ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు.
ఇసుక లేదని కొన్ని వీడియోలు పెట్టడం దాని గురించి చంద్రబాబుని నమ్మించడం, ఇక కొన్ని పోస్టులు పెట్టి లోకేష్‌ని నవ్వించడం వంటివి ఆశ్చర్యంగా మారాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం చేయడం దానిని పెదబాబు, చినబాబు వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం వంటివి ఇప్పుడు కార్యకర్తలను చికాకు పెడుతున్నాయి అనేది వాస్తవం. ఇక రంగుల గురించి సోషల్ మీడియా ప్రచారం చేస్తుంటే మిగిలిన సమస్యలు వదిలి వాటి గురించి మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. అంతిమంగా ఈ భజన వల్లే బాబు నిండా మునుగుతున్నా… ఆ వాస్తవం ఆయన తెలుసుకోవడం లేదు.