అచ్చెన్నాయుడు విడుదలై నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజుల్లో ఎక్కడా కూడా తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అరెస్టు, తదనంతర పరిణామాలతో కలత చెంది మాజీ మంత్రి సైలెంట్ అయ్యారనే ప్రచారం జరిగింది. గతం కంటే తీవ్రంగా ప్రభుత్వంపై విరుచుకుపడతారని ఆశించిన పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఇదే సమయంలో అచ్చెన్నకు రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. అధికారిక ప్రకటన విడుదల కాకపోవడానికి అచ్చెన్న అరెస్టుకు కమిటీ ప్రకటన మధ్య లింక్ ఉందని కొందరు చెపుతున్నారు.
ఏపీ టీడీపీ కమిటీ ప్రకటన తరువాత అచ్చెన్న పోరాటం ఎలా ఉండబోతుంది? అధినేతతో సహా క్యాడర్ అంచనాలను అందుకునేలా పోరాటం చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఓ హత్య కేసులో అరెస్టయి జైలులో ఉండి వచ్చారు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న కొల్లు తర్వాత బయటకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. అయితేకొల్లుపై క్యాడర్ కు ఇటువంటి అంచనాలు లేవని.. అచ్చెన్నపై హోప్ ఉంది కాబట్టే చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అధ్యక్ష బాధ్యతల్లో ఎలా వ్యవహరించాలనే దానికోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.