- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ మధ్య వైరం మరింతగా ముదురుతోంది. ఇప్పటివరకు కొనసాగిన మాటల యుద్ధం ప్రస్తుతం హద్దులుమీరి భౌతిక దాడులు చేసుకునే స్థాయికి ఆంధ్ర రాజకీయాలు దిగజారిపోయాయి. పలువురు టీడీపీ నేతలపై దాడులకు దిగడం పట్ల రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ప్రభుత్వం అవినీతిని వెలుగులోకి తెస్తే దాడులు చేస్తారా? ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇదేక్కడి బరితెగింపు? ముఖ్యమంత్రి జమగన్మోహన్ రెడ్డి దీనిని సమాధానం చెప్పి తీరాలి’ అని బాబు డిమాండ్ చేశారు.
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై పలువురు దుండగుల దాడికి పాల్పడ్డారనే సమాచారంతో ఆయన నివాసానికి చంద్రబాబు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల నియంత్రణేదీ? ప‌్రశ్నిస్తే చంపుతారా? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఖబడ్దార్. ముఖ్యమంత్రి.. మీ బూతుల మంత్రులకు, రౌడీ ఎమ్మెల్యేలకు చెప్పు.. ఇలాంటివి పునరావృతమైతే బట్టలు విప్పి తరిమే పరిస్థితి వస్తుంది’ అంటూ హెచ్చరించారు.
వైకాపా ప్రభుత్వం అవినీతినీ, సీఎం సొంత వ్యాపారాల కుంభకోణాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినందుకు పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడితే చంపుతారా? ఇలా ఎంతమందిని చంపుతారు? ప‌్రజలకు అండగా నిలిచిన నన్నూ చంపుతారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.