వరద బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. వారం దాటినా కనీస సాయం జగన్ సర్కార్ అందించలేదు అని మండిపడ్డారు. సర్వం కోల్పోయి అవస్థలు పడుతుంటే.. జగన్ రెడ్డి ఎక్కడ.? అని ప్రశ్నించారు. ప్రజలు వరదలతో అవస్థలు పడుతుంటే.. జగన్ రెడ్డి రాజప్రసాదంలో సేద తీరుతున్నారు అని ఆయన విమర్శించారు. వర్షాలతో రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.
వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. కృష్ణా నది పరివాహక లంక గ్రామాలు ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉన్నాయని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకోకపోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు గారు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు భరోసా, కనీసం రూ.1000 ఆర్ధిక సాయం అందించారు అని చెప్పారు. ఆర్టీజీఎస్ తో ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు. జగన్ రెడ్డి ఆర్టీజీఎస్ ను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు.