ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. పెరుగుతున్న టెస్టులే పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడానికి కూడా కారణం అని అంతా భావిస్తున్నతరుణంలో… ప్రభుత్వం, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమే! ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి పసలేని విమర్శలు ఎన్ని వస్తున్నా… వాటికి కౌంటర్లు ఇస్తూ, వివరణలు ఇస్తూ నోర్లు మూయిస్తూ… వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు సర్కారు జనాలు! ఈ క్రమంలో ఇంక ఎవరూ దొరకలేదో ఏమో కానీ.. వాలంటీర్ల పై కూడా రాజకీయ విమర్శలు చేయడం మొదలుపెట్టారు టీడీపీ నేతలు!
మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్క పెడితే… ఏపీలో వైద్యులు, అధికారులు, పోలీసులు, పారిశుధ్యకార్మికులు, ఆశావర్కర్లతోపాటు అదేస్థాయిలో.. ఈ కీలక సమయంలో కష్టపడుతున్నవారిలో గ్రామ వాలంటీర్లు కూడా ఉన్నారనే చెప్పుకోవాలి. గ్రామాల్లో రేషన్ వ్యవస్థ, పింఛన్ల వ్యవస్థ ఈ గడ్డుకాలంలో సక్రమంగా ప్రతీ ఇంటికీ అందుతుండటంలో వీరి పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఈ సమయంలో… వీరిపై కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేత బోండా ఉమ! ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ కుటుంబానికీ ఇస్తున్న రూ. 1000 సహాయ కార్యక్రమాన్ని వాలంటీర్లు నాశనం చేస్తున్నారు అన్నట్లుగా మొదలుపెట్టిన బోండా… వైకాపా నాయకులతో కలిసి ఈ వాలంటీర్లు ఆ రూ. 1000 ని దోచుకుతింటున్నారని విమర్శలు చేశారు!
కరోనా సమయంలో అధికారపక్షంపై పసలేని విమర్శలు చేసి అభాసుపాలవుతూ… ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా “కరోనా రాజకీయం” చేస్తున్న టీడీపీ నేతలపట్ల… తాజాగా చేసిన వాలంటీర్లపై విమర్శలతో మరింత దిగజారిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు! బోండా ఉమ ఇంకా… గ్రామాలను దోచుకుతిన్న్నారు అనే పేరు మూటగట్టుకున్న “జన్మభూమి కమిటీలు” ఉన్నాయనే భ్రమలో విమర్శలు చేస్తున్నారేమో అనే సెటైర్లు కూడా వేస్తున్నారు!