తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. సోమవారం హైకోర్టులో ఆర్టీసి కార్మికులకు సంబంధించిన విచారణ ఉండగా సీఎం కేసీఆర్ శనివారం రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం, శనివారం మళ్లీ చర్చలను నిర్వహించారు. కోర్టు ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుందో దాన్నిబట్టి తదుపరి కార్యాచరణ ఏం చేయాలన్న విషయాలపైన వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశ వివరాలను గురించి సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువరించకపోవడం విశేషం. కోర్టు ఎలా స్పందింస్తుందో వేచి చూద్దామని, ప్రభుత్వానికి వ్యతిరేక దృక్పథంతో కోర్టు ఉందని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఏసీ ప్రసాద్ తదితరులతో దాదాపు గంటన్నరపాటు ఆయన భేటీ అయ్యారు.