ముందు నుయ్యి.. వెనుక గొయ్యి… ఏమిచేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో తెలుగు తమ్ముళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు అధికారం లేకపోవడంతో అధికార పార్టీల పంచన చేరేందుకు టీడీపీకి టాటా చెపుతున్నారు. అటు వైసీపీ కాకుంటే బీజేపీ ఏది అనుకూలమైతే అందులోకి జంప్ చేస్తున్నారు. ఇంతకు టీడీపీకి ఇంత గడ్డు కాలం రావడానికి కారణం ఏమై ఉంటుంది.. ఎందుకు తెలుగు తమ్ముళ్ళు ఇతర పార్టీల గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు..
ఏపీ, తెలంగాణలో ఇప్పుడు కషాయం పార్టీ పసుపు పార్టీని భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు ఉన్నారు. అందులో భాగంగా ఏపీ బీజేపీ నేతలు వరుసగా బీజేపీ బాట పట్టారు. ఇంకా కమలం గూటికి చేరేందుకు సన్నద్దం అవుతూనే ఉన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటే తీసి కట్టు నామం బొట్టు అన్న చందంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ చచ్చిన పాములాగా మారగా ఇప్పుడు టీడీపీలో మిగిలిన సీనియర్ నేతలు కమలం పంచన చేరేందుకు సర్వసన్నద్దం అయ్యారు.
అందులో భాగంగా ఎన్నికల కన్నా ముందే టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ పోలీట్‌బ్యూరో మెంబర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు గులాబీ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ఇక ఏపీలో మాత్రం టీడీపీ నేతల తీరు మరోరకంగా ఉంది. ఓవైపు పార్టీని వీడుతున్న వారు వీడిపోతుండగా, కొందురు పార్టీలోనే ఉంటూ బీజేపీ జపం చేస్తున్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకుందామని చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు ఒంటెద్దు పోకడతో తీసుకున్న నిర్ణయం టీడీపీని చావు దెబ్బ తీసిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా బీజేపీతో రాబోవు రోజుల్లో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని నేరుగానే వ్యాఖ్యానించాడు. అంటే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల నష్ట నివారణ చర్యల్లో భాగంగా బీజేపీతో భవిష్యత్‌లో మరోమారు పొత్తు పెట్టుకునేందుకు పచ్చ జెండా ఊపి తన నేతల ద్వారా లీక్‌లు ఇప్పిస్తున్నాడనే కామెంట్లు వినపడుతున్నాయి. ఇక టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం కూడా చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలో భాగమేనని తెలిస్తుంది. అందుకే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీతో పొత్తుకు సై అంటున్నాడనే టాక్ వినిపిస్తుంది. సో భవిష్యత్‌లో టీడీపీ నేతలు కమలం జపం మరింత చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది.