తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం అశోక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాం తో సమావేశం నిర్వహించారని మీడియా వర్గాలకు సమాచారం అందింది.
తమ్మినేని సీతారాం కూడా ఆయనను ఆహ్వానించారని శ్రీకాకుళం జిల్లాలో మంచి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి మీకు సీటు ఖరారు చేస్తామనే హామీ కూడా ఆయన ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వైసిపి వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని గ్రహించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనతో సమావేశమయ్యారని తెలుస్తుంది.
పార్టీ మారకుండా ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారని అంటున్నారు. అలాగే జిల్లా నేతలతో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తాను వ్యక్తిగతంగా తీసుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. ఒకవేళ ఆయన పార్టీ మారితే మాత్రం ఆయనతో పాటుగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది.