వీరుడికి వందనాలు చెల్లించడం బాధ్యత..నివాళి అర్పించడం,కృతజ్ఞత చెల్లించడం కర్తవ్యం..అదే రీతిలో వారి కు టుంబానికి అండగా ఉండాలనుకోవడం అందుకు తనవంతు సాయం అందించేందుకు ముందుకు రావడం ఇప్పటి ముందరి లక్ష్యం..యువ ఎంపీ కింజ రాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల కార్గిల్ సమీపాన అశువులు బాసిన లాన్స్ నాయక్ లావేటి ఉమా మహేశ్వరరావు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆయన కుమార్తెల పేరిట చెరో రూ.25 వేలు చొ ప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా త్వరలో ఆయన విగ్రహం శ్రీకాకుళం నగరిలో నెలకొల్పేందుకు ముందుకువచ్చారు. ఈ మేరకు ప్రజాసదన్ కేంద్రంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ వివరాలివి..ఆయన మాటల్లోనే..ఇటీవల కార్గిల్ సమీపాన విస్ఫోటన పదార్థాలను నిర్వీర్యం చేస్తూ, అశువులు బాసిన లాన్స్ నాయక్ లావేటి ఉమామాహేశ్వరరావుకు నివాళి అర్పిస్తున్నాను. అంజలి ఘటిస్తున్నాను. ఆ బాధిత కుటుంబానికి నా వంతు సాయం చేయాలని నిర్ణయించాను. నా వంతుగా సామాజిక బాధ్యతను నిర్వర్తించే క్రమంలో ఆయన కుమార్తెలిరువురి పేరిట చెరొక రూ.25 వేలు అందించేందుకు త్వరలో వారి పేరిట ఈ మొత్తాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు సంబంధిత చర్యలు అతి త్వరలోనే పూర్తి చేయనున్నాను.ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించాను. కానీ ఆయన చనిపోయి వారం రోజులు దాటిపోయినా, సంబంధిత వర్గాల నుంచి ఎటు వంటి ప్రకటన లేకపోవడం బాధాకరం.
దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన వారి విషయమై అలసత్వం తగదు. వారు పోరాడుతున్నారుంటే ఈ దేశం తమ వెనుక ఉంటుందని, తమ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా రక్షించే బాధ్యత తీసుకుంటుందని భావించే వీరోచిత పోరాటాలకు సైతం వెనుకడగు వేయరు. కానీ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. అదేవిధంగా ఆ బాధిత కుటుంబానికి చేయూతగా ఉండాల్సిన తరుణంలో మీడియా కూడా ఈ మరణాన్ని తమ తమ మాధ్యమాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తూ చూపించేందుకు ఆ సక్తి కనబరచలేదు. పుల్వామా లాంటి ఘటనల విషయమై, లేదా చైనా సరిహద్దు తగాదాల విషయమై చూపించే శ్రద్ధలో కాస్తయినా ఇటువంటి వీరుల మరణాలకు సంబంధించి చూపకపోవడం బాధాకరం.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అమరుల త్యాగాలకు ఓ విలువ ఇవ్వాలి. వారికి ఆసరా ఇవ్వాలి. ఈ వేళ ఈ సిక్కోలు సింహానికి నేను జేజేలు పలుకు తున్నాను. నా వంతుగా నేను సాయం చేశాను. మీరు కూడా ముందుకు రండి అని మిగతా శ్రీకాకుళం ప్రజానికానికి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు స్థాపించిన భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున లావేటి ఉమామహేశ్వరరావు విగ్రహం నెలకొల్పేందుకు నేను సిద్ధం. కలెక్టర్ నుంచి అనుమతులు పొందాక యువతకు స్ఫూర్తి ఇచ్చేలా ఆయన చదువుకున్న పాఠశాలలో అయినా, ఏ గ్రంథాలయం ప్రాంగణంలోనో, ఏ క్రీడా స్థలిలోనో దీనిని ఏర్పాటుకు చర్యలు చేపడతాను.
ఈ బాధాతప్త సమయాన ఆ కుటుంబానికి ఏ సాయం కావాలన్నా అందిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అమరుడికి తగు నివాళిస్తూ, ఆ కుటుంబానికి చేయూత ఇవ్వాలి అని అభ్య ర్థిస్తున్నాను…వారిలో ధైర్యం నింపేందుకు అంతా కలిసి పనిచేద్దాం.. ఆ అమరుని స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపుకుందాం అంటూ తన మాటలు ముగించారు.