రాష్ట్రంలో ప్రధాన పక్షాలుగా ఉన్న అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల్లో ఏ పార్టీకి యువ నాయకత్వం ఉంది? ఏ పార్టీలో వృద్ధ నేతలు ఎక్కువగా ఉన్నారు? వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ యువ నేతలను ఆశ్రయించాల్సి ఉంటుంది? అనే లెక్కలు తీస్తే.. వైఎస్సార్ సీపీనే ముందుందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీలో మంత్రులు దాదాపు అంతా కూడా 50 ఏళ్లలోపు వారు.. లేదు ఒకటి రెండు సంవత్సరాలు అటు ఇటు ఉన్నారు. ఒక్కరిద్దరు తప్ప. వారు కూడా పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు వంటి వారు తప్ప.
అదే సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా వైఎస్సార్ సీపీలో యువకులే ఎక్కువగా ఉన్నారు. ఎంపీలుకూడా అంతే. ఇక, ఇచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ సీపీ పెద్దగా యువ నేతల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పైగా సీఎం కూడా యువ జాబితాలో ముందున్నారు. కానీ, టీడీపీ విషయానికి వస్తే.. యువకులు అత్యంత తక్కువగా ఉన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి. ఇక, యనమల కూడా అంతే. ఇక, రాయపాటి సాంబశివరావు, బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం (వైసీపీకి మద్దతిస్తున్నారు) వంటివారు రిటైర్మెంట్‌కు రెడీ అయ్యారు. ఇలా చాలా మంది వృద్ధ నేతలు కనిపిస్తున్నారు. పోనీ.. ఓడిపోయినా.. యువ నేతలు ఎవరైనా ఉన్నారా? అంటే వారు కూడా కనిపించడం లేదు.
పార్టీలో యువతకు 33 శాతం అవకాశం ఇస్తానని చెబుతున్న చంద్రబాబు ఆదిశగా అడుగులు వేయడం లేదు. పోనీ.. తన కుమారుడు యువకుడే. కానీ, ఉత్సాహ వంతుడు కాకపోవడమే ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారిపోయింది. పోనీ.. పరిటాల శ్రీరాం.. కోడెల శివరామకృష్ణ, రాయపాటి రంగారావు, మాగంటి రాంజీ వంటి యువ నేతలను ప్రోత్సహిస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ఓ ఆరు నెలల ముందు వీరికి పగ్గాలు అప్పగించినా.. ఎలాంటి ప్రయోజనం ఉంటుందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికిప్పుడు చూస్తే.. మాత్రం టీడీపీలో వృద్ధ నేతల ఆధిపత్యమే కనిపిస్తోంది. దీంతో యువ నేతల విషయంలో వైఎస్సార్ సీపీనే దూకుడుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.