తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నేతల మధ్య వైరుధ్యాలు మరింతగా పెరిగాయి. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తోట త్రిమూర్తులు పార్టీ మారి వైసీపీలో చేరిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. వాస్తవానికి ఎన్నికలకు ముందుగా నే తోట పార్టీ మార్పుపై అనేక కథనాలు వచ్చాయి. వైసీపీలోని ముఖ్య నేత ఉదయభానుకు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎన్నికలకు ముందుగానే పార్టీ మారి రామచంద్రపురం నుంచి ఆయన పోటీ చేస్తారని అనుకున్నారు.
అయితే, అప్పట్లో ఊగిసలాట ధోరణిని ప్రదర్శించిన తోట.. తాజాగా జగన్‌ను కలిసి కండువా కప్పుకొన్నారు. అయితే, రాజకీయంగా వైరి పక్షంగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్-తోట త్రిమూర్తు లు ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడంతో రాజకీయంగా జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే, పార్టీ మారినప్పటికీ.. త్రిమూర్తులతో తాను వైరం భావంతోనే ఉంటానని బోస్ చెప్పినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీలోనూ ఇలాంటి వైరి పక్షాలు పార్టీలో చేరిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఆది నారాయణరెడ్డి-సుబ్బారెడ్డి, అవినాష్-వంగవీటి రాధా వంటి వారు కూడా ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా వైసీపీలో ఈ తరహా వాతావరణం ఏర్పడింది. కాగా, తోట త్రిమూర్తులుపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ఎప్పటికైనా తనకు శత్రువేనని అన్నారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు… పోతుంటారని అన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీకి దళితులు అండగా ఉన్నారని, వారిని తాము వదులుకునే ప్రసక్తేలే దన్నారు. కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకెళ్తానని, అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా తాను సిద్దమని పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తోట వర్సెస్ బోస్‌ల మధ్య మరింత అఘాతం సృష్టించే అవకాశం ఉందని పార్టీకి కూడా ఇది మేలు చేసేలా లేదని అంటున్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.