భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు … అచ్చెన్న ప్రకటన

-

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న భారత్ బంద్‌ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు భారత్ బంద్‌ లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ సహకారంతోనే పోస్కో తో ఒప్పందం కుదిరిందన్న ఆయన ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి మారుపేరుగా వైసీపీ ఉందని విమర్శించారు. దేశానికి గర్వకారణం అయిన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పై లేదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చూసి వైసీపీలో కదలిక రావాలన్న ఆయన పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల పోరాటాన్ని దేశం మొత్తం  చూస్తోందని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news